: పోలీసుల కళ్లుగప్పి... సంకెళ్లతో పరారైన ఖైదీ!
మొన్న కడప, నిన్న రాజమండ్రి, తాజాగా నిజామాబాదు... పోలీసులకు పట్టుబడి తప్పించుకుపోతున్న నేరగాళ్ల ఉదంతాలు వరుసగా చోటుచేసుకున్నాయి. గత రాత్రి నిజామాబాదు జిల్లా డిచ్ పల్లిలో పోలీసులకు మస్కా కొట్టి ఓ నేరస్తుడు పరారయ్యాడు. అది కూడా చేతులు, కాళ్లకు వేసిన సంకెళ్లతో అతడు తప్పించుకున్నాడు. వివరాల్లోకెళితే... జిల్లాలోని రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన దొంగ రెడ్యా, డిచ్ పల్లి మండలం గన్నారంలోని ఓ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పట్టుకున్న గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. గతంలో అతడు చేసిన చోరీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే క్రమంలో రెండు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్న పోలీసులు, నేడు అతడిని రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అతడి చేతులు, కాళ్లకు గొలుసులతో సంకెళ్లేశారు. ఆ తర్వాత పోలీసులు వేరే పనుల్లో నిమగ్నం కాగా, సంకెళ్లతో సహా రెడ్యా పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.