: బంగారం కంటే చౌకగా ప్లాటినం... ఆభరణాలకు పెరిగిన గిరాకీ
అత్యంత విలువైన లోహంగా ఉన్న ప్లాటినం కుదేలైంది. దీంతో ఇటీవలి కాలం వరకూ, సంపన్న వర్గాలకే పరిమితమైన ‘ప్లాటినం’ నగలు, ఇపుడు మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్లాటినం ధర బంగారం కంటే తక్కువ స్థాయికి దిగిరావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.26,600 పరిసరాల్లో ఉండగా, 10 గ్రాముల ప్లాటినం ధర రూ.26,300కు తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గత సంవత్సరం ఔన్స్ (28.34 గ్రాములు) ప్లాటినం ధర 2,200 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం అది 1,150 డాలర్లకు పడిపోయింది. దీంతో ప్లాటినం నగల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 2014 ఫిబ్రవరి-మార్చితో పోలిస్తే, ఈ సంవత్సరం ప్లాటినం నగల అమ్మకాలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగినట్టు తెలుస్తోంది. రాబోయే వివాహ సీజన్ లో ప్లాటినం నగలకు మరింత డిమాండ్ వస్తుందని ఆభరణాల వ్యాపారులు భావిస్తున్నారు.