: 'మా'లో కూడా రాజకీయ ప్రమేయాలున్నాయి!: జయసుధ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లోనూ రాజకీయ ప్రమేయాలు ఉన్నాయని జయసుధ తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయవద్దంటూ నేతలతో ఒత్తిడి చేయించారని అన్నారు. తనపై వస్తున్న విమర్శల వల్లే మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నానని ఆమె తెలిపారు. రాజకీయాల్లో ఓటమిని ధైర్యంగా ఎదుర్కోనే శక్తి సంపాదించానని చెప్పిన జయసుధ, రాజకీయ అనుభవంతో 'మా'కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ, మా అభివృద్ధికి ఎంతో కృషి చేశామని అన్నారు. సీనియర్ నటి అయిన జయసుధ అయితే మా అధ్యక్ష పదవికి న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని అన్నారు. రాజకీయ అనుభవం కూడా ఆమెకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. సినీ నటులకు న్యాయం జరగాలంటే జయసుధను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.