: పిచ్ మీదే కుప్పకూలిన స్టెయిన్
ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యంత క్లిష్టమైన బౌలర్ డేల్ స్టెయిన్. ప్రత్యర్ధిని కట్టడి చేయడంలో స్టెయిన్ ది అందెవేసిన చేయి. పిచ్ స్వభావాన్ని ఆకళింపు చేసుకుని, అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంలో స్టెయిన్ ను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. లైన్ అండ్ లెంగ్త్ కు స్టెయిన్ పెట్టింది పేరని, అతని బౌలింగ్ ఎదుర్కొన్న ప్రతి బ్యాట్స్ మన్ చెబుతారు. అందుకే స్టెయిన్ బంతుల్ని గౌరవిస్తూ, ఇతరుల్ని శిక్షిస్తుంటారు. వరల్డ్ కప్ ను ముద్దాడాలని సౌతాఫ్రికా జట్టు ఎన్నో కలలు కంది. ప్రపంచకప్ అందుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా ఆటతీరు ప్రదర్శించింది. కానీ సెమీ ఫైనల్ లో కీలక సమయాల్లో చేసిన చిన్న పొరబాట్లు ఆ జట్టును టైటిల్ కు దూరం చేశాయి. ఫీల్డింగ్ లో చేసిన రెండు మూడు తప్పులు ఆ జట్టును భారీ మూల్యం చెల్లించేలా చేశాయి. ఏకంగా టైటిల్ పోరుకు దూరం చేశాయి. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన స్టెయిన్ తొలి రెండు బంతులు సింగిల్స్ కే పరిమితం చేయడంతో అంతా సఫారీలదే విజయం అని భావించారు. మూడో బంతిని వెటోరీ ఫోర్ గా మలిచినా, నాలుగో బంతిని మళ్లీ సింగిల్ కే పరిమితం చేయడంతో న్యూజిలాండ్ పని అయిపోయిందని భావించారు. ఐదో బంతిని సిక్స్ గా మలిచిన ఇలియట్ న్యూజిలాండ్ కు తిరుగులేని విజయం అందించగా, సఫారీ జట్టు విషాదంలో మునిగిపోయింది. ఇలియట్ సిక్స్ కొట్టడంతో సర్వశక్తులు ఒడ్డి వేసిన బంతిని కూడా సిక్స్ గా మలచడంతో, స్టెయిన్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు. ఓటమిని జీర్ణించుకోలేక సౌతాఫ్రికా జట్టు నిరాశతో పెవిలియన్ చేరింది.