: రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం ప్రకాశ్ కారత్, మమ్ముట్టి మధ్య పోటీ!
త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలోని మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును సీపీఐ-ఎం సునాయాసంగా గెలుచుకుంటుంది. దీని కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, ఆయన భార్య బృందా కారత్, ప్రముఖ సినీ నటుడు మమ్ముట్టి మధ్య గట్టి పోటీ నెలకొంది. మమ్ముట్టి సుదీర్ఘకాలంగా సీపీఐ-ఎం పార్టీకి అండగా వున్నారు. ఈసారి ఆయన రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. ఇక ప్రకాష్ కారత్, ఆయన భార్య బృందా (గతంలో ఆమె పశ్చిమబెంగాల్ నుంచి పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించారు) కూడా అదే సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులు, ఇతరులు కూడా ఈ రాజ్యసభ సభ్యత్వం కోసం రేసులో ఉన్నారు. ఉన్న ఒక్క సీటు కోసం ఇలా హేమాహేమీలు పోటీపడుతుండడంతో పార్టీ తన అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పోతే, మిగిలిన రెండు సీట్లు కాంగ్రెస్ కోటాలోకి వెళతాయి. వాటికి కూడా పోటీ తీవ్రంగానే వుంది.