: చంద్రబాబు చక్కని కథ చెప్పారు: జగన్


విద్యుత్ చార్జీల పెంపుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ స్పందించారు. అబద్ధాలతో చంద్రబాబు ప్రజలకు చక్కని కథ చెప్పారని ఎద్దేవా చేశారు. పీపీఏలు చేసుకోవడానికి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అప్పట్లో చార్జీలు పెంచితే ప్రజల్ని తిరగబడమన్న చంద్రబాబు, ఇప్పుడు తద్విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. గతంలో చంద్రబాబు 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచడానికి ఎలాంటి హేతుబద్ధత లేదని, పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇక, వైఎస్ పాలనలో రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని జగన్ చెప్పుకొచ్చారు. విద్యుత్ అంశంలో వైఎస్ పాలనలో అద్భుతమైన క్రిసిల్ రేటింగ్ వచ్చిందని, కానీ, చంద్రబాబు తన ప్రసంగంలో ఆ విషయమే ప్రస్తావించలేదని అన్నారు. తన లెక్కలు తప్పని తేలితే చంద్రబాబు పదవికి రాజీనామా చేస్తారా? సవాల్ విసిరారు. కిరణ్ పాలన కారణంగా వేల కోట్ల భారం పడిందంటున్న చంద్రబాబు, అదే కిరణ్ సర్కారును ఎందుకు కాపాడాడో చెప్పాలని నిలదీశారు. ఆనాడు విప్ జారీ చేయకపోతే కిరణ్ సర్కారు ఉండేది కాదని, రాష్ట్ర విభజన జరిగేది కాదని దుయ్యబట్టారు. ఇక, ఎవరిని సైకో అంటారో చంద్రబాబు గుండెలమీద చెయ్యేసుకుని చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News