: నన్ను నిలువునా ముంచారు!: ములాయం
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తన పార్టీ కార్యకర్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తనను నిలువునా ముంచారని ఆక్రోశించారు. కార్యకర్తలు తన ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 నుంచి 45 స్థానాలు గెలుచుకుని ఉంటే, కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి ఉండేవాళ్లమని అన్నారు. సోషలిస్టు రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ములాయం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా, సమాజ్ వాదీ పార్టీ 5 స్థానాల్లోనే నెగ్గింది. ములాయం, ఆయన కోడలు డింపుల్ యాదవ్, మేనల్లుళ్లు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రమే నెగ్గారు. యూపీలో బీజేపీ దాదాపు ఊడ్చిపారేసింది. ములాయం ఆవేదనకు అదే ప్రధానకారణమని తెలుస్తోంది.