: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా... మరికాసేపట్లో కివీస్ తో సెమీస్!
వరల్డ్ కప్ మెగా టోర్నీలో మరికాసేపట్లో తొలి సెమీఫైనల్ పోరు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ వేదికగా జరగనున్న ఈ సెమీస్ లో ఆతిథ్య న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టాస్ నెగ్గిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పటిష్టంగా ఉన్న రెండు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. ఇప్పటికే లీగ్ దశతో పాటు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సాధించిన వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతుండగా, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న సఫారీలు ఈసారైనా కప్ ను దేశానికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. నేటి మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టు ఫైనల్ కు వెళ్లనుండగా, ఓడిపోయే జట్టు ఇంటికెళ్లనుంది.