: అమెరికాలో వారం పాటు పర్యటించనున్న జపాన్ ప్రధాని
అమెరికా, జపాన్... ఒకప్పుడు ఈ రెండూ శత్రు దేశాలు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసింది అమెరికానే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండూ మిత్ర దేశాలు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకల నిర్వహణకు రెండు దేశాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో, వచ్చే వారం జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. ఓ వారం పాటు ఆయన యూఎస్ లో పర్యటిస్తారు. ఇదే సమయంలో యూఎస్ కాంగ్రెస్ లో ఆయన ప్రసంగించబోతున్నారు. దీంతో, అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించిన తొలి జపాన్ ప్రధానిగా షింజో అబే చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. షింజో పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ప్రధానంగా మిలిటరీ, వాణిజ్య సంబంధాల గురించి చర్చించనున్నాయి.