: నేత్రదాతల దాతృత్వం నీరుగారిపోతోంది... సగం మేర ‘కళ్లు’ పాడైపోతున్నాయట!
అన్ని దానాల్లోకి అవయవదానం ఉదాత్తమైనది. ఇతరులకు జీవం పోసే ఈ దాతృత్వ గుణం జనంలో నానాటికి పెరుగుతోంది. అయితే వారి దాతృత్వాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దాతల నుంచి అందిన అవయవాలను అవసరమైన వారికి సకాలంలో అమర్చడంతో పాటు భద్రపరచడంలోనూ ఘోరంగా విఫలమవుతోంది. నేత్రదానం విషయంలో ఈ వైఫల్యం కారణంగా సగం మేర కార్నియాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఇదేదో స్వచ్ఛంద సంస్థ చెప్పిన విషయం కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం నిగ్గుతేలింది. 2013-14లో దేశంలో మొత్తం 51,354 కళ్లు అందగా, వాటిలో 22,384 కళ్లను మాత్రమే వైద్యులు ఇతరులకు అమర్చగలిగారట. మిగిలిన వాటిని పడేయాల్సి వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా రాజ్యసభకు తెలిపారు. సేకరించిన కళ్లను భద్రపరిచేందుకు సరైన వసతులు లేని కారణంగానే ఈ నష్టం జరుగుతోందని ఆయన వెల్లడించారు.