: ఏసీలో టీడీపీ... ఎండలో వైకాపా
మొన్నటి దాకా ఘాటుగా, వాడీవేడిగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు... ఈ రోజు చాలా ప్రశాంతంగా, ఎలాంటి అలజడి లేకుండా కొనసాగుతున్నాయి. సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే... అసలు జరుగుతున్నది అసెంబ్లీ సమావేశాలా? లేక టీడీపీ, బీజేపీ మీటింగా? అన్నట్టుంది. దీనికంతా కారణం, వైకాపా మొన్నట్లో సభ నుంచి వాకౌట్ చేయడమే. స్పీకర్ పై అవిశ్వాస తీర్వానం ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు ... తీర్మానంపై చర్చకు పిలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని భీష్మించుకున్నారు. ఈ క్రమంలో, సభలో కేవలం టీడీపీ, తన మిత్రపక్షం బీజేపీలు మాత్రమే మిగిలాయి. ఏసీ చల్లదనంలో, వైకాపా సభ్యుల బాధ లేకుండా వీరంతా హాయిగా చర్చ జరుపుతున్నారు. మరోవైపు, లోటస్ పాండ్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు, అక్కడి నుంచి అసెంబ్లీ వరకు వైకాపా సభ్యులు మండుటెండలో పాదయాత్ర చేశారు. చివరకు, అసెంబ్లీ వద్దకు చేరుకున్న వైకాపా సభ్యులు చెట్లకింద ఫుట్ పాత్ లపై ఉసూరుమంటూ కూర్చున్నారు. ఏపీ స్పీకర్, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో, ఎండ వేడిమిని భరించలేక నానా బాధలు పడుతున్నారు.