: పురిటి మైలతో పట్టువస్త్రాలెలా సమర్పిస్తారు?... చంద్రబాబుకు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్న
శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఒంటిమిట్టలో జరగనున్న వేడుకలపై ఇప్పటికే వివాదాలు రేకెత్తగా తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శ్రీరామనవమికి పురిటి మైలతో ఎలా వస్తారంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు జరగాలని కాంక్షిస్తూ నిన్న విజయనగరం కోటలో జరిగిన శ్రీరామ యజ్ఞం సందర్భంగా శ్రీనివాసానంద ఈ మేరకు ఏపీ సీఎంను ప్రశ్నించి కలకలం రేపారు. అంతేకాక, శ్రీరామ నవమి వేడుకలకు చంద్రబాబు దూరంగా ఉండాల్సిందేనని కూడా శ్రీనివాసానంద శాసించారు. ఈ విపత్కర పరిస్థితి శాస్త్రవిరుద్ధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితమేనని అభివర్ణించిన ఆయన, శ్రీరామచంద్ర ప్రభువే చంద్రబాబును అనర్హుడిగా ప్రకటించారని కూడా పేర్కొన్నారు. మనవడు జన్మించడంతో పురిటి మైలతో చంద్రబాబు నవమి నాడు రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించే అర్హత కోల్పోయారని ఆయన అన్నారు.