: హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్... భువనగిరి కొండల వద్ద పారా గ్లైడింగ్: తెలంగాణ పర్యాటక సంస్థ
తెలంగాణలో టూరిజం అభివృద్ధి దిశగా మరిన్ని నిర్ణయాలను తెలంగాణ పర్యాటక సంస్థ (టీఎస్ టీడీసీ) కొత్త చైర్మన్ పేర్వారం రాములు వెల్లడించారు. హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్ ఏర్పాటు చేస్తామని, తద్వారా నగరానికి అంతర్జాతీయ పర్యాటక గుర్తింపు తెస్తామని ఆయన తెలిపారు. టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. వినోదం కోసం యువత దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భువనగిరి కొండ వద్ద పారా గ్లైడింగ్, ఘట్ కేసర్ లోని రంగనాథ చెరువులో బోటింగ్, ఫారెస్ట్, అడ్వంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. లండన్, పారిస్ లలో మాదిరిగా హైదరాబాదులో 600 అడుగుల జెయింట్ వీల్ ఏర్పాటు చేస్తామన్నారు.