: మాట మార్చిన ఐసీసీ అధ్యక్షుడు కమాల్... రాజీనామాపై వార్తలు మీడియా సృష్టేనని వ్యాఖ్య
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లా పరాజయంపై అక్కసు వెళ్లగక్కుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగానే కాక ఐసీసీ అధ్యక్షుడి హోదాలో సంచలన వ్యాఖ్యలు చేసిన ముస్తఫా కమాల్ మాట మార్చారు. పాక్ అంపైర్ అలీమ్ దార్ తప్పుడు నిర్ణయాల వల్లే తమ జట్టు ఓడిపోయిందని వ్యాఖ్యానించిన కమాల్, అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు నిరసనగా ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకూ వెనుకాడనని చెప్పిన విషయం తెలిసిందే. కమాల్ వ్యాఖ్యలను బంగ్లా ప్రధాని షేక్ హసీనా సైతం బలపరిచారు. అయితే ఆ మరునాడే కమాల్ మాట మార్చేశారు. తన వ్యాఖ్యలు మీడియా సృష్టేనంటూ కొట్టిపారేశారు. ఐసీసీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఆయన ప్రకటించారు. ఆ పదవికి రాజీనామా చేసే ఉద్దేశమే తనకు లేదని కూడా తేల్చిచెప్పేశారు.