: భారత్ కు ఫైన్ కట్టాల్సిందే... పాక్ కు షాకిచ్చిన లండన్ కోర్టు: నిజాం నిధులపై తుది తీర్పు


వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో మూలుగుతున్న నిజాం నిధుల వ్యవహారం ఎట్టకేలకు తేలింది. దాదాపు 67 ఏళ్లుగా కొనసాగిన ఈ కేసులో భారత వాదనే నెగ్గింది. పాకిస్థాన్ వితండ వాదం వీగిపోయింది. దీంతో లండన్ లోని సదరు బ్యాంకులో మూలుగుతున్న రూ.350 కోట్ల మేర నిధులు భారత్ కు అందేందుకు మార్గం సుగమమైంది. కేసును తప్పుదోవ పట్టించిన పాక్ కు లండన్ కోర్టు భారీ జరిమానా విధించింది. వివరాల్లోకెళితే... హైదరాబాదును పాలించిన నిజాం సంస్థానంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన నవాజ్ జంగ్, తన ప్రభువునే మోసం చేసి, పాక్ కు అనుకూలంగా వ్యవహరించాడు. హైదరాబాదు సంస్థానం భారత్ లో విలీనమైన రెండో రోజు అతడు 10,07,940 పౌండ్లను లండన్ లోని పాక్ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగుతున్న ఆ దేశ హై కమిషనర్ హెచ్ఐ రహీమ్ తుల్లా కు చెందిన నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తన అనుమతి లేకుండా నవాజ్ చేసిన నిధుల బదలాయింపు కుదరదని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాదించినా నాడు ఫలితం లేకపోయింది. దీనిపై ఆయన న్యాయపోరాటానికే మొగ్గుచూపారు. ఆ తర్వాతి కాలంలో నిజాం తరఫున భారత్ రంగంలోకి దిగింది. సుదీర్ఘకాలంగా సాగిన ఈ వివాదంలో తీర్పు భారత్ వైపు వచ్చే అవకాశాలున్న సమయంలో పాక్ సార్వభౌమాధికారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఈ కేసులో ప్రతిష్ఠంభన నెలకొంది. తాజాగా సుప్రీంకోర్టు తర్వాత బ్రిటన్ లో అత్యున్నత న్యాయస్థానంగా ఉన్న చాన్స్ రై హైకోర్టు నిన్న ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాక్ సార్వభౌమాధికారానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చిచెప్పింది. అంతేకాక న్యాయ ప్రక్రియలో భాగంగా భారత్ సహా ఇతర పార్టీలకు 4 లక్ష పౌండ్లను (దాదాపు రూ.3.72 కోట్లు) చెల్లించాలని పాక్ ను కోర్టు ఆదేశించింది. కోర్టు తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో మూలుగుతున్న రూ.350 కోట్ల నిధులు భారత్ కు అందనున్నాయి. నిధులను చేజిక్కించుకోవడం కంటే కూడా అంతర్జాతీయంగా ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకే ఇటు భారత్ సహా, అటు పాక్ కూడా దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

  • Loading...

More Telugu News