: కేవీపీ విలేకరుల సమావేశం పెట్టారు... చంద్రబాబు సర్కారును కడిగేశారు!


కేవీపీ రామచంద్రరావు మీడియా ముందుకొచ్చారు. అదేంటీ, 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు ఇదేమైనా కొత్తనా? అవును కొత్తనే. ఎందుకంటే 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడూ తెరవెనుక పాత్రే తప్పించి, తెరముందుకు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ఆయన స్నేహితుడిగానే కాక ఆయనకు కీలక అంశాల్లో సలహాదారుడిగానూ పనిచేశారు. ఈ క్రమంలో ఆయన అస్సలు మీడియా ముందుకే రాలేదు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఒకటి, రెండు సార్లు మీడియా అడిగితేనే స్పందించిన ఆయన, నిన్న ఢిల్లీలో ఏకంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా, అదనపు నిధులు తదితరాలపై సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కారుతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలు, సంస్కార రహిత వ్యాఖ్యానాలు ఏపీ పట్ల వారి నిర్లక్ష్య వైఖరిని సూచిస్తున్నాయని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి అనుకూలంగా తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాన్ని ఆసరా చేసుకుని బీజేపీ సర్కారును నిలదీయాల్సిన టీడీపీ ఎంపీలు, కేవలం ఎమ్మెల్సీ స్థానాలను పెంచుకోవడంపైనే దృష్టి సారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రాజధానితో ఆ ప్రాంతంలోని చంద్రబాబు ఆస్తుల విలువ పెరిగిందని కేవీపీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News