: పీతల సుజాతకు జరిగిన అవమానమే రేపు వైసీపీ దళిత ఎమ్మెల్యేలకు జరుగుతుంది: జూపూడి
టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు వైసీపీ మహిళా నేత రోజాపై ధ్వజమెత్తారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా రోజా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో రోజా తీరు చూస్తే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటుందని విమర్శించారు. దళితులకు రోజా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆమెపై అట్రాసిటీ కేసు పెడతామని హెచ్చరించారు. సభలో మంత్రి పీతల సుజాతకు జరిగిన అవమానమే రేపు వైసీపీ దళిత ఎమ్మెల్యేలకు జరుగుతుందని ఆయన అన్నారు. మంత్రి పీతల సుజాత శరీరాకృతిపై రోజా చేసిన అసభ్య వ్యాఖ్యలను జూపూడి తప్పుబట్టారు. రోజాను జగన్ అదుపు చేయలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. "ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో ఏం పీక్కుంటారో పీక్కోండి" అని రోజా నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారని, ఆమె తీరును సహించేది లేదని స్పష్టం చేశారు.