: ఇంజి... కిసాసి చా ఎంవిషో... ఇది రాజమౌళి తీసిని సినిమానే!
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి మార్కెట్ విస్తరిస్తోంది. చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజా ప్రాజెక్టు బాహుబలి గురించి ఈ రెండు దేశాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఇక, ఆయన పెద్ద హీరోల జోలికి వెళ్లకుండా తీసిన సినిమా 'ఈగ'. ఈ రివెంజ్ బేస్డ్ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. తాజాగా, ఈ సినిమాను ఆఫ్రికాలోనూ విడుదల చేసినట్టు రాజమౌళి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. తూర్పు ఆఫ్రికాలో ఎక్కువగా మాట్లాడే స్వాహిలి భాషలో డబ్ చేశారట. ఈగను 'ఇంజి' పేరిట టాంజానియా, కెన్యా, ఉగాండా, రువాండా, బురుండీ, కాంగో దేశాల్లో స్టెప్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ విడుదల చేసినట్టు తన పోస్టులో పేర్కొన్నారు. అన్నట్టు, ఇంజికి ఓ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. కిసాసి చా ఎంవిషో... ఇదే ఆ ట్యాగ్ లైన్. స్వాహిలి లాంగ్వేజిలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఇదేనని రాజమౌళి తెలిపారు.