: కారులో 24 కిలోల బంగారం... పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు
అదో చిన్న కారు. హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరింది. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు రాగానే పోలీసులు నిలిపేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అంతే, కారులోని బంగారు మూటను చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 24 కిలోల బంగారం. సదరు బంగారానికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు. అనుమానం వచ్చిన పోలీసులు కారులోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కారులోని వ్యక్తులను విచారిస్తున్నారు. ఓ జ్యూవెలరీ షాపుకు చెందిన బంగారాన్ని తీసుకెళుతున్నామని కారులోని వ్యక్తులు చెప్పినట్లు సమాచారం. అయితే, అంత భారీ ఎత్తున బంగారాన్ని ఎలాంటి రక్షణ లేకుండా ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించిన పోలీసులకు ఆ వ్యక్తుల నుంచి సమాధానం రాలేదు. దీంతో, ఈ విషయంలో మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించారు.