: ఓటర్లు రాకముందే ఓట్లు పోలవుతున్నాయట... భీమవరంలో రిగ్గింగ్ పై టీచర్ల ఆందోళన
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాలకు రాకముందే తమ ఓట్లు పోలవడంపై భీమవరంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. దీంతో అభ్యర్థులు ప్రతి ఓటునూ విలువైనదిగానే భావిస్తున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన 101 పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు వెళ్లిన ఉపాధ్యాయులు, అప్పటికే తమ ఓట్లు పోలైనట్లు తెలుసుకుని కంగు తిన్నారు. వెనువెంటనే తేరుకున్న ఉపాధ్యాయులు, పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. అంతేకాక తమ ఓట్లను వేరే వాళ్లతో ఎలా వేయిస్తారంటూ అక్కడే ఆందోళనకు దిగారు.