: ఐఏఎస్ అధికారి రవి వేధింపులపై చంద్రబాబు ‘సన్నిహిత’ ఐఏఎస్ కు తెలుగు లేడీ ఐఏఎస్ ఫిర్యాదు
కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవికుమార్ ఆత్మహత్యోదంతం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తన బ్యాచ్ మెట్ అయిన తెలుగు మహిళా ఐఏఎస్ అధికారిని రవి వేధింపులకు గురి చేశారని, ఈ క్రమంలో ఆయన పలుమార్లు ఆమెకు ఫోన్లు చేయడంతో పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంపారని తెలుస్తోంది. రవి వేధింపులతో తీవ్ర ఇబ్బందులకు గురైన ఆ మహిళా అధికారి ఏపీకి చెందిన వారనీ, ఈ క్రమంలో ఆమె ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్ద పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారని కూడా విశ్వసనీయ సమాచారం. వేధింపులకు గురైన మహిళా అధికారిని మాండ్య జిల్లా పంచాయతీ సీఈఓ రోహిణి సింధూరిగా గుర్తించిన కర్ణాటక సీఐడీ పోలీసులు, ఆమె ఆశ్రయించిన చంద్రబాబు ‘సన్నిహిత’ అధికారి పేరును మాత్రం బహిర్గతం చేయడం లేదు. ఇప్పటికే చంద్రబాబు ‘సన్నిహిత’ ఐఏఎస్ ను కర్ణాటక సీఐడీ ప్రశ్నించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ‘సన్నిహిత‘ అధికారి సలహాతో రవి వేధింపులపై కర్ణాటక చీఫ్ సెక్రటరీకి సింధూరి ఫిర్యాదు కూడా చేశారట. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీని కూడా ప్రశ్నించాల్సి ఉంది. ఈ కారణంగానే ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీతో పాటు చంద్రబాబు ‘సన్నిహిత’ ఐఏఎస్ ను ప్రశ్నించే అధికారం కర్ణాటక సీఐడీకి లేదని, సీబీఐ అయితేనే ఈ కేసు విచారణను పూర్తి స్థాయిలో చేపట్టగలదని ఆయన వాదిస్తున్నారు.