: పాలిటిక్స్ లో కొనసాగడమా... చిత్రసీమలోకి రీ ఎంట్రీనా?: నేడు మెగాస్టార్ ఫ్యాన్స్ కీలక భేటీ


టాలీవుడ్ అగ్రనటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోనే కొనసాగుతారా? లేక తనకిష్టమైన చిత్ర రంగానికి తిరగి వస్తారా? అన్న అంశంపై నేడు ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు చిరు అభిమానులు నేడు హైదరాబాదులో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లోని చిరు అభిమాన సంఘాలకు చెందిన కీలక సభ్యులు పాలుపంచుకోనున్నారు. 'ప్రజారాజ్యం' పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమైన చిరంజీవి, ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో బాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది. ఈ క్రమంలో చిరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాక, బడ్జెట్ సమావేశాల్లో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆయన పార్లమెంటుకు హాజరయ్యారు. దీంతో రాజకీయాలపై చిరుకు ఆసక్తి తగ్గిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సోదరుడు పవన్ కల్యాణ్ ‘జన సేన’ పేరిట పార్టీని ప్రకటించడం, ఆ పార్టీకి అభిమానం వెల్లువెత్తుతుండటం కూడా చిరును డైలమాలో పడేసిందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే, తన 150వ చిత్రంపై ప్రస్తుతం చిరు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ తరహా పరిణామాలన్నింటిపై చర్చించేందుకే నేడు చిరు ఫ్యాన్స్ సమావేశమవుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News