: త్వరలో గంటా కొడుకు టాలీవుడ్ ఎంట్రీ... రుద్రమదేవి ఆడియో రిలీజ్ లో ప్రకటన
ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు సినీ వినీలాకాశంలోకి రానున్నాడట. సాధారణంగా రాజకీయ నేతల పుత్రులు రాజకీయాల్లో కొనసాగేందుకే ఇష్టపడుతుండగా, గంటా కుమారుడు రవితేజ మాత్రం టాలీవుడ్ రంగ ప్రవేశానికే మొగ్గు చూపాడట. ఈ మేరకు విశాఖలో జరుగుతున్న రుద్రమదేవి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో వ్యాఖ్యాత ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాక రుద్రమదేవి చిత్రంలోని ఓ పాటను విడుదల చేసేందుకు గంటాను వేదికపైకి ఆహ్వానించిన యాంకర్, రవితేజను కూడా ఆహ్వానించింది. రవితేజ టాలీవుడ్ ఎంట్రీపై యాంకర్ చేసిన ప్రకటనను వేదికపైనే ఉన్న గంటా శ్రీనివాసరావు ఖండించలేదు సరికదా, ముసిముసి నవ్వులు నవ్వారు. అంటే, రవితేజ టాలీవుడ్ లోకి దూకేందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉన్నారు. తండ్రి ఆమోదంతో రవితేజ తన గ్రాండ్ ఎంట్రీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టే ఉంది.