: ఓ ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు: కమల్ హాసన్
'ఉత్తమ విలన్' ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విశ్వనటుడు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ పై వివాదం తలెత్తడం తెలిసిందే. ఆ పోస్టర్లలో, కేరళ సంప్రదాయ కళారూపాలను తలపించేలా ఫేస్ పెయింటింగ్ తో కమల్ కనిపిస్తాడు. కానీ, ఆ గెటప్ ఓ ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోను అనుకరించినట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. దీనిపై కమల్ వివరణ ఇచ్చారు. 'థెయ్యమ్' అనేది 1000 ఏళ్ల నాటి పురాతన భారతీయ కళారూపం అని, దాన్ని తాను ఓ ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం లేదని అన్నారు. "ఓ ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ భారత్ వచ్చి, కృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయాన్ని ఫొటో తీస్తే, అది అతనిదవుతుందా?" అని ప్రశ్నించారు. తాను 'ఉత్తమ విలన్'లో రెండు పురాతన కళారూపాలను సమ్మిళితం చేసేందుకు యత్నించానని, ఒన్ విల్లు, థెయ్యమ్ లను తన సినిమాలో చూపానని వివరించారు. కర్ణాటకలో వినుతికెక్కిన యక్షగానం కూడా 'థెయ్యమ్' నుంచి ఉద్భవించినదని తెలిపారు. ఫేస్ పెయింటింగ్ అనేది దక్షిణాది ఆలయాల్లో వేల ఏళ్లుగా ఉన్నదేనని వివరించారు.