: విండీస్ ఓటమి... సఫారీలతో 'సెమీ'తుమీకి సిద్ధమైన కివీస్
ఆతిథ్య న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వెల్లింగ్టన్ లో నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కివీస్ 143 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తుచేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ జట్టు గప్టిల్ (237 నాటౌట్) వీరవిహారంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 393 పరుగులు చేసింది. అనంతరం, అతి భారీ లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్ల కథ మధ్యలోనే ముగిసింది. భారీ షాట్లతో విరుచుకుపడ్డ గేల్ (61) అవుటవడంతో పరాజయం దిశగా పయనించారు. చివరికి 30.3 ఓవర్లలో 250 పరుగులకు చాపచుట్టేశారు. కెప్టెన్ హోల్డర్ 42 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. సౌథీ, వెట్టోరీకి చెరో 2 వికెట్లు దక్కాయి. ఈ విజయంతో సెమీఫైనల్లో ప్రవేశించిన కివీస్, ఈ నెల 24న ఆక్లాండ్ లో బలమైన దక్షిణాఫ్రికాతో ఫైనల్ బెర్తు కోసం అమీతుమీ తేల్చుకోనుంది.