: చాక్లెట్లు, డబ్బు ఆశచూపి మైనర్ బాలికలపై అత్యాచారం... కీచక ఐఏఎస్ అధికారి అరెస్టు!
అతడు సమాజానికి సేవ చేసేందుకు నియమితుడైన ఐఏఎస్ అధికారి. పేరు ఎంహెచ్ సావంత్. మహారాష్ట్రలో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగంలో డైరక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వయసు 58 ఏళ్లు. కానీ, అతడి బుద్ధి వక్రమార్గం పట్టింది. పుణే శివాజీనగర్ లో నివసించే ఇతగాడు తరచు హింగానే ఖుర్ద్ ప్రాంతంలోని తన మామ ఇంటికి వెళుతుండేవాడు. అక్కడి హౌసింగ్ సొసైటీ పార్కింగ్ స్థలంలో ఆడుకునేందుకు వచ్చే పాఠశాల విద్యార్థినులకు చాక్లెట్లు, డబ్బు ఆశచూపి వారిని తీసుకెళ్లి అత్యాచారం జరిపేవాడు. గదిలోకి తీసుకెళ్లగానే ముందు ఆ బాలికలకు తన కంప్యూటర్ లో అశ్లీల చిత్రాలు చూపేవాడు. ఆపై తన కోరిక తీర్చుకునేవాడా రాక్షసుడు. బాధిత బాలికలు పదేళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఆ మైనర్లు తమపై జరిగిన అఘాయిత్యాలను తమ పాఠశాల కౌన్సెలర్ కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కౌన్సెలర్ పాఠశాల హెచ్ఎంకు విషయం చెప్పగా, ఆమె స్థానిక కార్పొరేటర్ కు తెలిపింది. ఆ కార్పొరేటర్ దంపతులు పోలీసులకు వివరించారు. దీంతో, ఆ కీచక ఐఏఎస్ అధికారిని అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.