: రాజేష్ ఖన్నాకు పద్మభూషణ్.. స్వీకరించిన డింపుల్
నేడు రాష్ట్రపతి భవన్ లో 'పద్మ' అవార్డుల రెండో విడత ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను 'పద్మభూషణ్' వరించగా.. ఆయన భార్య, అందాలతార డింపుల్ కపాడియా ఆ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డింపుల్, ఆమె పెద్ద కుమార్తె ట్వింకిల్ అవార్డును స్వీకరించే సమయంలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రొమాంటిక్ హీరోగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజేష్ ఖన్నా గతేడాది జులై 18న తుదిశ్వాస విడిచారు.
కాగా, ప్రఖ్యాత కమెడియన్ జస్పాల్ భట్టికి కూడా మరణానంతరం 'పద్మభూషణ్' ప్రకటించారు. ఆయన అర్థాంగి సవిత నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఇక 'పద్మభూషణ్' అందుకున్న వారిలో పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్, మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఉన్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.హెచ్. రజా.. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అయిన 'పద్మ విభూషణ్' అందుకున్నారు.
కాగా, బాలీవుడ్ విలక్షణ నటుడు నానాపాటేకర్, ఆల్ టైమ్ హిట్ 'షోలే' దర్శకుడు రమేష్ సిప్పీ, రెజ్లర్ యోగేశ్వర్ దత్, షూటర్ విజయ్ కుమార్ లకు 'పద్మశ్రీ' బహూకరించారు. ఈ అవార్డుల తొలి విడత కార్యక్రమాన్ని ఏప్రిల్ 5న నిర్వహించారు.