: ఇక వార్తలు వినిపించనున్న ఎఫ్ఎం రేడియోలు
ప్రైవేటు ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు వార్తలను ప్రసారం చేసే అనుమతి ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. షరతులకు లోబడి వార్తల ప్రసారానికి అనుమతులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఆల్ ఇండియా రేడియో తరహాలో వార్తలు ప్రసారం చేస్తే అభ్యంతరం లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ నేడు లోక్ సభకు తెలిపారు. సభ్యులడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ప్రభుత్వ ప్రకటనలను, ట్రాఫిక్ తదితర సమాచారాన్ని విస్తృతంగా ప్రసారం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆయన తెలిపారు. అందుకు అవసరమైన సమాచారం ఆల్ ఇండియా రేడియో నుంచి ఎఫ్ఎంలు పొందవచ్చని వివరించారు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా ప్రసారం చేసుకోవచ్చని, అవే వార్తలను తమ న్యూస్ రీడర్లతో చదివించుకోవచ్చని తెలిపారు.