: కాపులకు రూ. 1000 కోట్లు ఎక్కడ బాబూ? చెప్పేది, చెడగొట్టేదీ నువ్వే!: వైయస్ జగన్ నిప్పులు
కాపులను బీసీల్లో చేరుస్తామని, చేనేత కార్మికులకు, కాపుల సంక్షేమం నిమిత్తం రూ. 1000 కోట్ల చొప్పున ఇస్తానని ఇచ్చిన హామీలు ఏమైనాయని వైకాపా అధినేత వై.ఎస్. జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కుల రాజకీయాలు చేయటంలో ఆయన సిద్ధహస్తుడని విమర్శించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీలను బాబు నమ్మించి మోసం చేశారని, కాపులను బీసీల్లో చేర్పించడానికి ఎవరు అడ్డు తగిలారని నిప్పులు చెరిగారు. గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ బాబు వైఖరి ఇలాగే ఉందన్న జగన్, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, మళ్లీ దీనిపై కోర్టులకు వెళ్లేలా చూస్తారని ఎద్దేవా చేశారు. కాపులను బీసీల్లో కలిపే విషయంలోనూ కోర్టులో కాలయాపన చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అన్నారు.