: రజనీకాంత్ పిటీషన్ పై విచారణ మరోమారు వాయిదా
'మేహూ రజనీకాంత్' హిందీ సినిమా విడుదలను నిషేధించాలని కోరుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇటీవల కేసును విచారించిన న్యాయస్థానం ఈ సినిమా విడుదలపై తాత్కాలిక స్టేను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చెన్నై నగరానికి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా, తనను ప్రతివాదిగా చేర్చాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జడ్జి జస్టిస్ సుబ్బయ్య, ఆయనను ప్రతివాదిగా చేర్చే విషయంలో రజనీకాంత్ తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఇటీవల ఆదేశించారు. నేడు కేసు విచారణకు రాగా, రజనీకాంత్ తరపు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఆయనను కలిసే అవకాశం రాలేదని, ఆయనను కలిసి సమాధానం తీసుకుని అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.