: మాటలు కోటలు దాటుతున్నాయి...నవ్వుల్లో అసెంబ్లీ: రావెల, విష్ణుకుమార్ రాజు మధ్య సంవాదం


విశాఖపట్టణంపై మంత్రి రావెల కిషోర్ కుమార్, విశాఖ ఉత్తర బీజేపే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య జరిగిన ఆసక్తికర సంవాదం ఏపీ అసెంబ్లీలో నవ్వుల పువ్వుల పూయించింది. హుదూద్ బారినపడిన విశాఖను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం లేదని, కేవలం తుపాను వచ్చినప్పుడు సహాయం చేశారని, విశాఖ ప్రజల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని, అందువల్ల రోడ్డుపక్కన ప్రజలు జీవించాల్సిన దుస్థితి నెలకొందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. మంత్రులు ఎవరైనా విశాఖకు వస్తే అంతులేని ప్రేమాప్యాయతలు కురిపించేస్తారని, మాటలు కోటలు దాటుతాయని ఆయన ఎద్దేవా చేశారు. దానికి మంత్రి రావెల సమాధానమిస్తూ, విష్ణు కుమార్ రాజు గారు తన శ్రమనంతా దోచేసుకున్నారని అన్నారు. హుదూద్ తుపాను సమయంలో తనను పిండేశారని వాపోయారు. అంత చేసినా కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదని అన్నారు. అయినా ఆయనన్నా, విశాఖ అన్నా తమకు అభిమానమేనని ఆయన చెప్పారు. టీడీపీ నిద్రపోతున్న వ్యక్తులను కూడా ఎంపీలను చేసే గొప్ప మనసున్న పార్టీ అని ఆయన చెప్పారు. దానిపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఎక్కడైనా బాగా పని చేశారని పార్టీ టికెట్లు కేటాయిస్తారని, కానీ మంత్రి గారు చెప్పిన ప్రకారం బాగా నిద్రపోయినా టికెట్లు వస్తాయని తెలుస్తోందని అన్నారు. ఈ సారి బాగా పడుకున్నవాళ్లు వస్తే మీ దగ్గరకు పంపుతామని ఆయన అనడంతో అసెంబ్లీ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. సీరియస్ గా కనిపించే స్పీకర్ కోడెల కూడా నవ్వేశారు.

  • Loading...

More Telugu News