: బాగా తాగి వచ్చి ఆ టీచర్ని చితక్కొట్టేయండి: విద్యార్థులకు ఓ టీచర్ హితబోధ


మంచి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు తన స్వార్థానికి విద్యార్థులను వినియోగించుకునే ప్రయత్నం చేసి వారిని తప్పుదోవపట్టించాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా ఇలుప్పూర్ సమీపంలోని ముక్కన్నామలైపట్టి ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు మద్యం తాగి స్పృహతప్పి పడిఉండగా, సహవిద్యార్థులు గుర్తించారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లి విషయం ఆరాతీయగా ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గతేడాది ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి సర్వీస్ రిజిస్టర్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ ఉపాధ్యాయుడు తన ఎస్ఆర్ కనిపించకుండా పోవడానికి కారణం ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న సహోపాధ్యాయుడేనని అనుమానించాడు. దీంతో వారి మధ్య వివాదం నెలకొంది. ఆ ఘటనపై ఇరువురు ఉపాధ్యాయులు గ్రామ విద్యాకమిటీకి ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులుగా పాఠశాలలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎస్ఆర్ కోల్పోయిన ఉపాధ్యాయుడు తన వర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు 500 రూపాయలు ఇచ్చి పూటుగా తాగి పాఠశాలకు వచ్చి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు, అతని అనుచరులపై దాడి చేయాలని చెప్పాడు. దీంతో మద్యం కొనుక్కొచ్చిన విద్యార్థులు పాఠశాల వద్దే తాగి, మోతాదు మించడంతో పడిపోయారు. ఈ విషయాలను విద్యార్థులు మద్యం మత్తులో తల్లిదండ్రులకు గొణుగుతూ చెప్పడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో వారి తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించారు. డీఈవో సంఘటనపై విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News