: స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం... నేటి సమావేశాలకు గైర్హాజరు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్ష వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. మొన్న, నిన్న సభలో జరిగిన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఎనిమిది మంది వైసీసీ సభ్యులు సస్పెండయ్యారు. దీంతో స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సభ్యులతో కలిసి నిన్న సభ నుంచి వాకౌట్ చేశారు. అంతేకాక స్పీకర్ తీరుపై ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయించిన ఆయన, తన పార్టీ ఎమ్మెల్యేల చేత అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఇదిలా ఉంటే, కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టింది. స్పీకర్ పై తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆహ్వానిస్తేనే సభకు వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్, అప్పటిదాకా సభ మొహం చూడొద్దని తీర్మానించుకున్నారట. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై తాను చేయాలనుకుంటున్న ప్రసంగాన్ని నేడు మీడియా ముందు వినిపించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.