: భారత ముస్లింలు దేశభక్తులు... అందుకే ఐఎస్ విఫలమైంది: రాజ్ నాథ్
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత ముస్లింలను దేశ భక్తులుగా పేర్కొన్నారు. వేర్పాటువాద సిద్ధాంతాలకు వారు ఆకర్షితులు కారని ధీమా వ్యక్తం చేశారు. జైపూర్ లో కౌంటర్ టెర్రరిజంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు భారత ముస్లిం యువతను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆ మత వర్గం భారత జాతీయ స్రవంతిలో ఒదిగిపోయిందని, అందుకే ఐఎస్ పన్నాగాలు ఫలించలేదని వివరించారు. నిఘా సంస్థల సమాచారం ప్రకారం, ఎవరో కొందరే భారత్ నుంచి వెళ్లి ఐఎస్ లో చేరారని, వారిలో కొందరు తిరిగి కుటుంబం కోసం వచ్చేశారని రాజ్ నాథ్ తెలిపారు. వైవిధ్యం పరంగా భారత్ గర్వించదగ్గ దేశమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత భారత్ లోనే ముస్లిం జనాభా అధికమని అన్నారు.