: శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో మిథున్ చక్రవర్తికి సమన్లు
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. శారదా చిట్ ఫండ్ కంపెనీ ప్రచారకర్తగా మిథున్ చక్రవర్తి వ్యవహరించారు. అందుకు శారదా చిట్ ఫండ్స్ సంస్థ ఆయనకు రెండు కోట్ల రూపాయలు ముట్టజెప్పిందని, అది అక్రమార్జన అని ఈడీ విచారణలో వెల్లడైంది. దీంతో గతేడాది జూన్ లో ఈడీ అధికారులు ముంబైలో మిథున్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా, కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు వెల్లడిస్తానని ఆయన ఈడీకి తెలిపారు. బ్యాంకు ఖాతాల వివరాలు వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారానైనా తెలియజేయాలని ఈడీ ఆయనను ఆదేశించింది. అయితే, ఆయన అకౌంట్ల వివరాలు వెల్లడించకపోవడంతో సమన్లు జారీ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. కాగా, దీనిపై మిథున్ చక్రవర్తి లాయర్ బిమన్ శంకర్ మాట్లాడుతూ, ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. కాగా, మిథున్ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ(రాజ్యసభ)గా కొనసాగుతున్నారు.