: 109 పరుగుల తేడాతో భారీ విజయం... కప్ కు రెండడుగుల దూరంలో టీమిండియా
బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్ లో టీమిండియా 109 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తాజా విజయంతో... ఈ వరల్డ్ కప్ లో సెమీ పైనల్ వరకు పరాజయం ఎరుగని జట్టుగా, వరుసగా ఏడు మ్యాచ్ లలో ప్రత్యర్థులను ఆలౌట్ చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ (137), రైనా (65) రాణించడంతో బంగ్లాదేశ్ జట్టుకు 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కట్టడి చేశారు. చివరికి బంగ్లా జట్టు 45 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లో తమీమ్ ఇక్బాల్ (25), సౌమ్యాసర్కార్ (29), మహ్మదుల్లా (21), షకిబ్ అల్ హసన్ (10), ముష్ఫికర్ రహీమ్ (27), షబ్బీర్ రహమాన్ (30), నాసిర్ హుస్సేన్ (35) రాణించినప్పటికీ వ్యక్తిగత స్కోర్లను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు. షమి, జడేజా చెరో రెండు వికెట్లు తీసి అతనికి సహకరించగా, మోహిత్ ఓ వికెట్ తీశాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా రోహిత్ శర్మ నిలిచాడు. తాజా విజయంతో టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రేపు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరులో విజేతతో సెమీఫైనల్ లో టీమిండియా తలపడనుంది.