: కేంద్ర హోం మంత్రిని కలిసిన ఏపీ బీజేపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ నేతలు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాగ్దానాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని రాజ్ నాథ్ వారికి హామీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని అన్నారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, అందుకు అవసరమైన ప్రక్రియను జరగకుండా పార్లమెంటులో అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.