: ఎప్పుడూ నేను ఫస్ట్ క్లాస్ విద్యార్థినే: జగన్
స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చకు పిలిచేవరకు అసెంబ్లీకి వెెళ్లేది లేదని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నానని, తాను ఐసీఎస్ఇ సిలబస్ లో చదివానని, ఆది నుంచి తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నని జగన్ చెప్పారు. 1999 నుంచి 2009 వరకు బెంగళూరులోనే ఉన్నానని జగన్ స్పష్టం చేశారు. 2010 మార్చిలో తాను హైదరాబాదులో అడుగుపెట్టానని జగన్ చెప్పారు. రోశయ్యతో తన తల్లి మాట్లాడేందుకు ఆయనేమన్నా తన చిన్నాన్నా? లేక పెదనాన్నా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్పితే, టీడీపీ నేతలు ఎవరైనా అసెంబ్లీ సమావేశాల్లో సరైన సమాధానం చెప్పారా? అని ఆయన నిలదీశారు. సబ్జెక్ట్ లేని టీడీపీ నేతలు ఏం మాట్లాడినా స్పీకర్ అవకాశమిస్తారని, అదే వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే మైక్ కట్ చేస్తారని ఆరోపించారు. అలాంటప్పుడు స్పీకర్ కు పక్షపాతం లేదని ఎలా అనమంటారని ఆయన అడిగారు.