: వెంకన్న దర్శనంలో గవర్నర్ కు స్వల్ప అస్వస్థత... బ్యాటరీ వాహనంలో విడిదికి తరలింపు
తిరుమల వెంకన్న దర్శనంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంకన్న దర్శనం కోసం తిరుమల వెళ్లిన గవర్నర్ దంపతులు నిన్న వేకువజామున అర్చన సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూర్చుని ఉన్న నరసింహన్ తూలి పడబోగా పక్కనే ఉన్న ఆయన సతీమణి పట్టుకున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అనంతరం శ్రీవారి సన్నిధి నుంచి నరసింహన్ నెమ్మదిగా వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి వరాహస్వామి ఆలయానికి నడిచే వెళతానని ఆయన చెప్పినప్పటికీ... ఆయన సతీమణి విమల, టీటీడీ ఈఓ సాంబశివరావు బలవంతంగా ఆయనను నిలువరించి బ్యాటరీ వాహనం తెప్పించారు. పుష్కరిణిలోని నీళ్లు చల్లుకున్న ఆయన వాహనంపైనే విడిదికి చేరుకున్నారు. అనంతరం విడిదిలో వైద్యం చేయించుకుని హైదరాబాదు బయలుదేరారు.