: జానాతో ఎర్రబెల్లి, రేవంత్ ల భేటీ... సస్పెన్షన్ ను ఎత్తివేయించాలని అభ్యర్థన!
తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిలు కొద్దిసేపటి క్రితం సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో భేటీ అయ్యారు. తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని వారు జానారెడ్డిని కోరారు. అనుచితంగా వ్యవహరిస్తే, ఒకట్రెండు రోజుల పాటు సస్పెన్షన్ విధింపు సరేనన్న వారు, మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్సెండ్ చేయడమేమిటని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టీ టీడీపీ నేతల అభ్యర్థనపై స్పందించిన జానారెడ్డి, ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వంతో ఓ సారి మాట్లాడానని చెప్పారు. మరోమారు సర్కారుతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానించారన్న ఆరోపణలతో టీ టీడీపీకి చెందిన పది మంది సభ్యులను బడ్జెట్ సమావేశాల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.