: హాలీవుడ్ యాక్షన్ సినిమా సన్నివేశాన్ని తలపించిన పోలీసుల ఛేజింగ్
హాలీవుడ్ యాక్షన్ సినిమా సన్నివేశం తలపించేలా పోలీసు ఛేజింగ్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారును భద్రతా బలగాలు వెంబడిస్తుండడంతో అతను పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయాడు. ఈ క్రమంలో మార్గంలో ఓ కారును గుద్దేశాడు. దీంతో ఆ కారును నడుపుతున్న మహిళ ఆపడంతో, ఆమెకు సమాధానం చెప్తున్న నెపంతో ఆ కారును సమీపించిన దుండగుడు, ఆమెను కారులోంచి బయటికి లాగేసి, ఆమె కారుతో పరారయ్యాడు. ఆ కారును కూడా పోలీసులు వెంబడించడంతో, దానిని మరింత వేగంగా నడుపుతూ, మరో జంక్షన్ లో ఇంకో కారును ఢీ కొట్టాడు. దీంతో ఆ మహిళ కారు వెనుక చక్రం కారు నుంచి విడివడింది. దీంతో దానిని వదిలేసిన దుండగుడు గుద్దిన కారును తస్కరించేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సఫలం కాకపోవడం, అంతలోనే పోలీసులు చేరుకోవడంతో పరుగు లంకించుకున్నాడు. చివరకు అతనిని చుట్టుముట్టిన పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఛేజింగ్ ముగిసింది. కాగా, అతనిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్నది పోలీసులు వెల్లడించలేదు.