: టెన్నిస్ లో తెలుగు 'నిధి'
తెలుగుతేజం చిలుముల నిధి (20) ఫెడరేషన్ కప్ లో ఆడే భారత జట్టుకు ఎంపికైంది. ఈ జట్టుకు స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా నాయకత్వం వహిస్తోంది. ఫెడ్ కప్ వచ్చే నెల 14న ఆరంభం కానుంది. కాగా, మెదక్ జిల్లాకు చెందిన నిధి కొంతకాలంగా దేశీయ సర్క్యూట్లలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో రెండు విభాగాల్లో రజతాలు సాధించింది. సానియాను ఆదర్శంగా తీసుకుని రాకెట్ చేతబట్టిన ఈ అమ్మాయి అనతికాలంలోనే అగ్రశ్రేణి ప్లేయర్లను సవాల్ చేయగల స్థాయికి ఎదిగింది. 2013లో సానియా అకాడమీలో చేరిన నిధి తన ఆటకు మరింత పదునుపెట్టుకుంది. నిధి ఆటలోనే కాదు, నడవడిక పరంగానూ అందరి మన్ననలు అందుకుంది. సానియా తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. వారు ఆమెను ఎంతో ప్రోత్సహించారట. సానియా తల్లిదండ్రులకు తానెంతో రుణపడి ఉన్నానని వినమ్రంగా చెబుతుందీ తెలంగాణ ప్రతిభావని. ప్రస్తుతం నిధి జాతీయ ర్యాంకు 5. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని, గ్రాండ్ స్లామ్ నెగ్గాలని ఆమె భావిస్తోంది. ఆ దిశగా ముందుకెళుతోంది.