: మేమూ ఉప్పూకారం తింటున్నాం: రోజా
తాము కూడా ఉప్పూకారం తింటున్నామని, తమకూ పౌరుషం ఉంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ దృశ్యాలను మాత్రమే విడుదల చేశారని ఆమె ఆరోపించారు. టీడీపీ రేపుతున్న వివాదానికి ముందు సభలో జరిగిన అంశాల దృశ్యాలను ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు. ప్రతి రోజూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే టీడీపీ నేతల్లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఎదురుదాడికి దిగుతారని, వారికి సమాధానం ఇస్తే దళితుల వ్యతిరేకులుగా ముద్రవేసే కుట్ర జరుగుతుందని ఆమె చెప్పారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు ప్రతిగా స్పందించామని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ వేస్తున్న తప్పుడు అడుగులను సరిదిద్దే ప్రయత్నం చేస్తే, తమపై ఎదురు దాడికి దిగుతున్నారని ఆమె చెప్పారు. పోలవరం పూర్తి చేయకుండా, పట్టిసీమ ఎందుకని ఆమె నిలదీశారు. అంగన్వాడీల సమస్యలపై చర్చించండి అంటే, ఎలా వ్యవహరించారో వాటి దృశ్యాలను కూడా విడుదల చేయాలని అడగాలని మీడియాకు ఆమె సూచించారు. నిండు సభలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాను శాంతంగా ఎలా స్పందించగలనని ఆమె ప్రశ్నించారు.