: అప్పుడు రోశయ్య చేసిన వ్యాఖ్యలే... ఇప్పుడు టీడీపీకి అస్త్రంగా మారాయి
తమిళనాడు గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేసిన ఓ వ్యాఖ్య... అధికార టీడీపీ సభ్యులకు ఇప్పుడు బలమైన అస్త్రంగా మారింది. అదే సమయంలో వైసీపీ అధినేతను ఇరకాటంలోకి నెడుతోంది. అప్పట్లో ఒకానొక సందర్భంలో రోశయ్య మాట్లాడుతూ, "జగన్ తో వేగలేకపోతున్నాను, అందుకే జగన్ ను బెంగళూరులో ఉంచానని దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు" అని తెలిపారు. ఈ కామెంట్లనే ఇప్పుడు టీడీపీ నేతలు అస్త్రాలుగా వాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన కటింగ్ లను టీడీపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పట్టుకు వచ్చి జగన్ పై పలు ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు.