: శ్రీలంకకు గుండెకోత... సెమీస్ లో సఫారీలు
శ్రీలంక జట్టు వరల్డ్ కప్ ఆశలు గల్లంతయ్యాయి. గత ప్రపంచకప్ లో రన్నరప్ తో సరిపెట్టుకున్న లంకేయులు ఈ పర్యాయం కప్ సాధించి జయవర్ధనే, సంగక్కరలకు ఘనంగా వీడ్కోలు పలకాలని భావించినా, సఫారీల సంకల్పం ముందు అది నెరవేరలేదు. సిడ్నీలో ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో లంకను చిత్తుగా ఓడించి సెమీస్ లో ప్రవేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 37.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. ఫాంలో ఉన్న సంగక్కర 45, తిరిమన్నే 41 పరుగులు చేశారు. సఫారీ స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్ 4, డుమినీ 3 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం, స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి జయకేతనం ఎగురవేశారు. డి కాక్ 78, డు ప్లెసిస్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆమ్లా 16 పరుగులు చేసి అవుటయ్యాడు. సఫారీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.