: ముందస్తు అరెస్టుల పర్వం షురూ... హైదరాబాదులో టెన్షన్, టెన్షన్!
డిమాండ్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్, నిరుద్యోగ జేఏసీలు ప్రకటించిన అసెంబ్లీ ముట్టడి హైదరాబాదులో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. ఇప్పటికే అసెంబ్లీ పరిధిలో 2 కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలను నిషేధించిన పోలీసులు, నగర వీధుల్లో భారీగా కవాతు చేస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించి కాని వదలట్లేదు. ఇదిలా ఉంటే, కొద్దిసేపటి క్రితం ముందస్తు అరెస్టుల పర్వం మొదలైంది. విద్యార్థి జేఏసీతో పాటు నిరుద్యోగ జేఏసీకి నేతృత్వం వహిస్తున్న ఓయూ విద్యార్థి సంఘం నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఇప్పటికే 80 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కీలక నేతలు, విద్యార్థి జేఏసీ నేతల ఫోన్లపై పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు అసెంబ్లీలోకి వెళుతున్న వారిని పూర్తిగా సోదాలు చేసిన తర్వాత కాని పోలీసులు అనుమతించడం లేదు.