: పాక్ తీరు మారింది... నేడు 12 మందిని ఉరితీసింది!


తీవ్రవాదుల పట్ల తన వ్యవహార శైలిలో పాకిస్థాన్ తీరుమారుతున్నట్టు కనిపిస్తోంది. పాలుపోసి పెంచిన పాము మాదిరిగా తీవ్రవాదులు వ్యవహరిస్తుండడం పట్ల పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో శిక్షణ తీసుకుని, ప్రభుత్వ వ్యతిరేకత పేరిట వరుస బాంబు పేలుళ్లతో స్వదేశీయులనే హతమారుస్తుండడం పట్ల పాక్ ప్రజలు మండిపడుతున్నారు. దీంతో తీవ్రవాదులపై తిరగబడుతున్నారు. ఆదివారం రెండు చర్చిలపై ఆత్మాహుతి దాడులకు తెగబడడంతో స్ధానికుల కోపం కట్టలు తెంచుకుంది. దీంతో అనుమానితులు ఇద్దరిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో నేడు ఒకే రోజు ఉగ్రవాదం, హత్యా నేరాల కింద మరణశిక్ష పడిన 12 మంది ఖైదీలను ఉరి తీశారు. పాక్ ప్రభుత్వం మరణశిక్షపై నిషేధం ఎత్తివేసిన తరువాత ఒకే రోజు 12 మందికి శిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. కరాచీ, లాహోర్, ఝాంగ్, రావల్పిండి, ముల్తాన్, మియాన్ వాలీ, ఫైసలాబాద్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 12 మంది ఖైదీలను ఉరితీశారు. మరణశిక్షపై నిషేధం ఎత్తివేసిన తరువాత ఇప్పటి వరకు మొత్తం 39 మందిని ఉరితీశారు.

  • Loading...

More Telugu News