: 'డివిలియర్స్ వర్సెస్ సంగక్కర'లో విజేత ఎవరో?
ఐసీసీ ప్రపంచకప్ లో నాకౌట్ పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టుతో శ్రీలంక తలపడనుంది. రెండు జట్లు కీలక ఆటగాళ్ల మీద ఆధారపడుతున్నాయి. బౌలింగ్ వనరులు, ఆల్ రౌండర్లు పుష్కలంగా గల ఈ రెండు జట్లు ఓ రకంగా సమవుజ్జీలనే చెప్పవచ్చు. బ్యాటింగ్ లో సఫారీలు డివిలియర్స్ పైనా, లంకేయులు సంగక్కరపైనా ఆధారపడుతున్నారు. ఈ ఇద్దరి ప్రదర్శనపైనే ఆయా జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సఫారీ జట్టు డివిలియర్స్, ఆమ్లా, డుప్లెసిస్, మిల్లర్, డుమిని నిలదొక్కుకుంటే భారీ స్కోరు ఖాయమని భావిస్తుండగా, శ్రీలంక జట్టు సూపర్ ఫాంలో ఉన్న సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్, తిరిమన్నే నిలదొక్కుకుంటే ఎంత పెద్ద లక్ష్యమైనా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. బౌలింగ్ లో స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్, ఇమ్రాన్ తాహిర్ సౌతాఫ్రికా బలమైతే... మలింగ, కులశేఖర, మాథ్యూస్, హెరాత్ శ్రీలంక అస్త్రాలు. టెయిలెండర్లలోని బ్యాటింగ్ నైపుణ్యం రెండు జట్లకు బోనస్ లాంటిదే. తొలి నాకౌట్ పోరులో బలమైన జట్లు తలపడుతుండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని, అభిమానుల్ని అలరిస్తుందని వెటరన్ లు అభిప్రాయపడుతున్నారు. కాగా, క్రికెట్ లో ఏదైనా సాధ్యమేనని, విజేతను ముందుగా పేర్కొనడం సాహసమేనని విశ్లేషకులు సూచిస్తున్నారు.