: 'జిహాద్'... అనేసరికి ఉలిక్కిపడ్డారు, ఆపై హడలిపోయారు!


వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ పై అల్ ఖైదా దాడి అమెరికన్ల స్మృతిపథం నుంచి ఇంకా తొలగిపోలేదు. ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా టెర్రర్ లింకుందేమోనంటూ అనుమానిస్తున్నారు. తాజాగా, వాషింగ్టన్ శివార్లలోని డల్లెస్ ఎయిర్ పోర్టు నుంచి డెన్వర్ వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం కొద్దిసేపటికే తిరిగొచ్చింది. కారణం, అందులోని ఓ ప్రయాణికుడు "జిహాద్... జిహాద్" అంటూ అరుస్తూ కాక్ పిట్లో ప్రవేశించేందుకు యత్నించడమే. అతడి అరుపులతో ఉలిక్కిపడ్డ ప్రయాణికులు అతడి దూకుడు చూసి హడలిపోయారు. విమానం హైజాక్ చేస్తాడేమోనని భయపడ్డారు. అయితే, అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని గుర్తించి దొరకబుచ్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 33 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం తిరిగి డల్లెస్ ఎయిర్ పోర్టుకు రాగానే, అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, అతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ఆసుపత్రికి తరలించారని మెట్రోపాలిటన్ వాషింగ్టన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రతినిధి కింబర్లీ గిబ్స్ తెలిపారు.

  • Loading...

More Telugu News