: ధావన్ లో మార్పు తెచ్చిన రవిశాస్త్రి!
టీమిండియా కోచింగ్ డైరెక్టర్ గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాక ఆటగాళ్ల దృక్పథంలో బాగా మార్పు వచ్చింది. వరుస పరాజయాలు ఎదురైనా కుంగిపోకుండా ఉండడం, ఒకరి బాధ్యతలను మరొకరు పంచుకోవడం, విభేదాలున్నా జట్టుకోసం అన్నీ పక్కనబెట్టడం... ఇవన్నీ వరల్డ్ కప్ లో ఆడుతున్న ధోనీ సేనలో కనిపిస్తాయి. ఆసీస్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించని ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పుడు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ధావన్ లో ఒక్కసారే అంత మార్పు రావడంతో క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. బౌన్సీ పిచ్ లపై ఇబ్బందులు ఎదుర్కొనే ధావన్ ఇతడేనా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెఫ్ట్ హ్యాండర్ లో మార్పుకు కారణం రవిశాస్త్రే. తన సమస్యలను ధావన్... శాస్త్రి ముందుంచాడు. ఎంతో అనుభవజ్ఞుడైన శాస్త్రి ఆటకు సంబంధించిన విషయాల జోలికి వెళ్లకుండా, అసలు సమస్యను గుర్తించి దానిపై మాట్లాడాడు. అతను కుంగుబాటుకు గురైన విషయాన్ని తెలుసుకుని తనవంతు ఊరట వచనాలతో ఓదార్చాడు. మానవ సంబంధాలు, కుటుంబం, మానసిక పరమైన అంశాలను చర్చించి ధావన్ లో ఉత్సాహాన్ని నింపాడు. నిగ్రహం, ప్రశాంత చిత్తం ఎలా అలవర్చుకోవాలో చెప్పాడు. శాస్త్రి మాటలు ప్రభావం చూపాయన్న దానికి టోర్నీ గ్రూప్ దశలో ధావన్ చేసిన పరుగులే నిదర్శనం. గ్రూప్ లో మొత్తం 6 మ్యాచ్ లు ఆడిన ధావన్ 337 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 94.13 కావడం విశేషం.